ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకుల వేటలో పడి పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్కూల్, ట్యూషన్లు, ఎక్స్ట్రా క్లాసులు అంటూ చిన్నారులు తమ బాల్యాన్ని ఆస్వాదించడం మరచిపోతున్నారు. ఒకటో తరగతి నుండే బండెడు పుస్తకాలు.. వీపుకు వేలాడే బ్యాగులు.. ఇదే విద్యార్థి జీవితం గా మారింది. అయితే ఈ విధానాన్ని మార్చేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. తాజాగా బడికి పోయే విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఓ గుడ్న్యూస్ ను వెల్లడించారు.
ఇక నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయబోతున్నట్లు లోకేష్ ప్రకటించారు. నో బ్యాగ్ డే అంటే శనివారం స్కూల్ ఉంటుంది. కానీ పిల్లలు పుస్తకాల బ్యాగ్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు విద్యార్థులకు కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఎప్పుడూ పుస్తకాల్లో పాఠాలే కాకుండా.. పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు, ఆహ్లాదాన్ని నింపేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, యాక్టివిటీస్ నిర్వహించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు.
గతంలో నో బ్యాగ్ డే నిర్వహించాలని కొన్ని ప్రభుత్వాలు భావించాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు, బడి అంటే భయాన్ని పోగొట్టేందుకు నో బ్యాగ్స్.. నో స్ట్రెస్ అనే కాన్సెప్ట్ పై మంత్రి లోకేష్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ విధానాన్ని ఏపీలో ఓ పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక లోకేష్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయంటే.. ప్రతి శనివారం స్టూడెంట్స్ కు పండగే అవుతుంది.