టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన అనుకున్నట్టే నగరాలు.. కార్పొరే షన్ల పరిధిలో సైకిల్ స్పీడు పెరుగుతుందా? ఇదీ ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ కీలక నాయ కులు చేస్తున్న అంతర్మథనం. తాజాగా మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి.. ఇతర పార్టీలకు భిన్నంగా టీడీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిపై విమర్శలు వచ్చినా.. ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అదేసమయంలో రెండు పేజీల మేనిఫెస్టోలో పేర్కొన్నవాటిలో కీలకమైన వాటిపై ప్రజల్లో చర్చ జరుగుతుండడం గమనార్హం.
అధికార పార్టీకి సెగపెడతాయని భావిస్తున్న కీలక హామీలు రెండు ఉన్నాయి. ఒకటి.. 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తానని హామీ ఇవ్వడం. నిజానికి ఇది చాలా సక్సెస్ అయిన పథకం. గత 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ. అయితే.. గత ఎన్నికలకు ముందు దీనిని ప్రారంభించారు. ప్రజల్లోకి ముఖ్యంగా కార్మిక వర్గాల్లోకి ఈ పథకం బాణం మాదిరిగా దూసుకుపోయింది. రిక్షా కార్మికుల నుంచి అన్ని వర్గాల కార్మికులు రూ.5కే టిఫిన్, భోజనం చేశారు.
ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే.. ధరలు మండిపోయి.. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఉంటే బాగుంటుందనే వాదన నగరాలు, పట్టణాల్లో తరచుగా వినిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామనే హామీ.. తారాస్థాయిలో వైరల్ అయింది. సో.. ఇది టీడీపీకి కలిసి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, మరో కీలక హామీ.. పన్నుల తగ్గింపు.. మాఫీ. ఇప్పటి వరకు బకాయి ఉన్న ఆస్తి, ఇంటి పన్నులను మాఫీ చేయడం. ఇది కూడా పట్టణ ప్రజలకుఉపశమనం కలిగించే కీలక హామీగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనానేపథ్యంలో ఆదాయాలు తగ్గి.. ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీ.. సక్సెస్ అవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.