టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో స్థాపించిన `ఎన్టీఆర్ మోడల్ స్కూల్`లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు పార్టీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపా రు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన యువకులు.. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు.
ఎన్టీఆర్ స్కూల్లో చదివిన వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. వీరందరూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే.. తమకు విద్యాబుద్ధులు నేర్పి.. జీవితంలో స్థిరపడేలా చేసిన ఎన్టీఆర్ స్కూల్‌ను స్థాపించిన పార్టీ పట్లకృతజ్ఞత తెలిపారు. ఈ క్రమంలోనే యువగళంలో లోకేష్‌ను కలిసి వారంతా సంఘీభావం తెలిపారు. ఇలా వచ్చిన వారికి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన తమను ఎన్టీఆర్ మోడల్ స్కూలు అమ్మలా అక్కున చేర్చుకుందని తెలిపారు.
మంచి హాస్టల్ తో పాటు, కార్పొరేట్ స్థాయి విద్యను ఎన్టీఆర్ మోడల్ స్కూల్ తమకు అందించడంతో ఇప్పుడు జీవితంలో సెటిలయ్యామని అన్నారు. ఈరోజు మెరుగైన జీతాలు అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివే వారిలో 80 శాతం మంది ఐఐటీ, నీట్ లో ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. మరికొందరు క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికై విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని, మీలాంటి మరికొందరికి చేయూత నందించాలని లోకేష్ పేర్కొన్నారు. అనంతరం నారా లోకేష్ వెంట వారు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.