తెలుగు దేశం పార్టీ కార్యకర్త, నారా లోకేశ్ వీరాభిమాని శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి తాజాగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని పెద్ద తప్పు చేశావంటూ సోసల్ మీడియా వేదికగా లోకేష్ ఎమెషనల్ అయ్యారు. `అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు` అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. శ్రీను మృతి పట్ల లోకేశ్ సంతాపం ప్రకటించారు.