ఈనెల 5వ తేదీ నుంచి భువనేశ్వరి బస్సుయాత్రకు రెడీ అవుతున్నట్లు సమాచారం. స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబును అన్యాయంగా అరెస్టుచేశారని, జైలులో ఉంచారని భువనేశ్వరి వాదిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండుకు నిరసనగా జనాల్లోకి వెళ్ళి మద్దతు కూడగట్టాలని భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. అందుకనే బస్సుయాత్రకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
మొదట్లో తన తండ్రి పుట్టిన కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో బస్సుయాత్రను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వివిధ కారణాలతో యాత్ర ప్రారంభ వేదికను నిమ్మకూరు నుండి కుప్పంకు మార్చినట్లు తెలుస్తోంది. కుప్పం అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసిందే. కుప్పంలో యాత్రను మొదలుపెట్టడం ద్వారా రాయలసీమ టూరుకు శ్రీకారం చుట్టబోతున్నారు.
మొదట్లో జిల్లాల కేంద్రాల్లో మాత్రమే యాత్రను చేయాలని అనుకున్నారు. అయితే ఎందుకనో ప్లాన్ మొత్తాన్ని మార్చేసినట్లు కనబడుతోంది. అయితే భువనేశ్వరి తాజా ప్లాన్ ఏమిటన్నది అర్థం కావట్లేదు. కుప్పంలో మొదలుపెట్టే బస్సుయాత్రను నియోజకవర్గాల వారీగా చేస్తారా ఏమిటనే విషయంలో క్లారిటీ లేదు. నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేయటం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి బస్సుయాత్ర మొదలుపెడితే మొత్తం 175 నియోజకవర్గాల్లోను చేయాల్సుంటుంది. అలా కాకుండా చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యేంతవరకే బస్సు యాత్ర చేస్తారా ? అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో అనుకున్నట్లు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రమే బస్సు యాత్రంటే 13 రోజుల్లో యాత్ర ముగుస్తుంది. 13 రోజుల్లో యాత్ర చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే యాత్రలో భువనేశ్వరితో పాటు కీలకమైన నేతలంతా పాల్గొంటారు. కాబట్టి వాళ్ళు దగ్గరుండి యాత్ర రూటు మ్యాపుతో పాటు మిగిలిన ఏర్పాట్లను చూసుకుంటారు. జనసమీకరణ కూడా పెద్ద కష్టంకాదు. అదే 175 నియోజకవర్గాలంటే మాత్రం పార్టీకి జనసమీకరణ చాలా కష్టమవుతుంది. మరి రూటుమ్యాపు విషయంలో క్లారిటి లేదు కానీ యాత్రను కుప్పం నుండి మొదలవ్వాలని మాత్రం భువనేశ్వరి ఫిక్సయ్యారని పార్టీవర్గాల సమాచారం. బహుశా ఈరోజు సాయంత్రానికి అన్నీ విషయాలు తెలిసే అవకాశముంది.