గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్ని హాట్ హాట్ గా మార్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతంపై తాజాగా ఆమె స్పందించారు.
ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఆమె పెదవి విప్పారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పిన ఆమె.. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి.. తోబుట్టువుకు.. కుమార్తెకు జరిగినట్లుగా భావించి తనకు అండగా నిలవటాన్ని తాను మర్చిపోలేనన్నారు. చిన్నతనం నుంచి తన తల్లి.. తండ్రి తమను విలువలతో పెంచారన్నారు. నేటికి వాటిని తాము పాటిస్తూనే ఉంటామన్నారు.
విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని.. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదని పేర్కొన్నారు.
తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం మాట్లాడని భువనేశ్వరి తాజాగా ప్రకటన విడుదల చేయటంతో.. ఆమె స్పందనపై ఆసక్తి వ్యక్తమవుతోంది.