ఏపీ సీఎం జగన్ ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హుజూర్‌నగర్‌లో జగన్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ సమన్లు జారీ అయ్యాయి. కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించడంతో జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌పై అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
మొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు చేసింది. దీంతో, ఈ రోజు జరిగే విచారణకు జగన్ హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. అయితే, ఈ రోజు జగన్ విచారణకు హాజరు కాలేదు. దీంతో, జగన్ ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఇంకా సమన్లే అందలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో సంబంధిత అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి.
అంతేకాదు, ఈ నెల 31లోగా జగన్‌కు సమన్లు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వ అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. ఇక, ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. నాగిరెడ్డి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడో నిందితుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించింది.