సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. వలపు వల విసిరి.. అందులో చిక్కుకునేలా చేసి.. ఆపై బ్లాక్ మొయిలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పైసలు పోయినా ఫర్లేదు.. పరువు మాత్రమే ముఖ్యమనుకునే బలహీనతను తమ పెట్టుబడిగా మార్చేసుకుంటున్నారు. ఇప్పుడీ దందా అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఈవెంట్ మేనేజర్ కు ఫేస్ బుక్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది.
తనను తాను మోడల్ గా పరిచయం చేసుకున్న ఆమె.. చాలా త్వరగా కనెక్టు అయ్యింది.ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ.. వలపు వల విసిరింది. నగ్నంగా చాటింగ్ చేయటం.. ఒకరినొకరు వీడియో కాల్ లో మాట్లాడుకోవటం చేశారు. అయితే.. ముందస్తు పథకంలో భాగంగా సదరు ఈవెంట్ మేనేజర్ ను అడ్డంగా బుక్ చేసేలా తాను నగ్నంగా ఉంటూ.. అతడ్ని రెచ్చగొట్టింది. తనను ఉచ్చులో ఇరికించేందుకే ఇదంతా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించని అతను కూడా.. నగ్నంగా ఆమెతో ఛాటింగ్ చేశాడు.
ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. అతడి వీడియో కాల్ ను రికార్డు చేసి.. దానిని అతని సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద పోస్టు చేస్తామంటూ బెదిరింపులు షురూ చేశారు. గుట్టుగా సాగుతున్న వ్యవహారం.. రచ్చకెక్కితే సమాజంలో తనకున్న పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయన్న భయాందోళనకు గురైన సదరు ఈవెంట్ మేనేజర్.. సైబర్ నేరగాళ్లు కోరినట్లుగా రూ.5లక్షలు వారి అకౌంట్లో వేశాడు.అక్కడితో ఆగని వారు మరో రూ.5లక్షలు ఇస్తే ఊరుకుంటామని.. లేదంటే వారి వీడియోల్ని యూట్యూబ్ లో వైరల్ చేస్తామని బ్లాక్ మొయిల్ చేశారు.
దీంతో.. తెలిసిన వారి వద్ద అడిగి మరో రూ.5లక్షలు వారు చెప్పిన ఖాతాకు డిపాజిట్ చేశాడు. మళ్లీ రూ.10లక్షలు కావాలని కోరటంతో.. ఈ బాధ తట్టుకోలేక అతడు హైదరాబాద్ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో.. అతడి సోషల్ మీడియా ఖాతాల్ని రద్దు చేయాలంటూ పోలీసులు.. నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ తరహాలో హనీ ట్రాప్ వేసి.. ఉచ్చులో చిక్కుకునేలా చేసి భారీ ఎత్తున డబ్బులు లాగేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.