నర్తనశాల, అశ్వథ్థామ లాంటి చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ యువ కథానాయకుడు జోరేమీ తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో అతనొకడు. అతడి చేతిలో ఉన్న సినిమాలకు మంచి క్రేజ్ కూడా ఉంది. కరోనా టైంలో సినిమాలేమీ రిలీజ్ చేయలేకపోయాడు కానీ.. చకచకా సినిమాలైతే లాగించేశాడు. వరుడు కావలెను, లక్ష్య ఈ రెండు చిత్రాలూ పూర్తి చేసి.. ఇంకో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.
వాటిలో ఒక్కొక్కటి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అతను పూర్తి చేసిన రెండు చిత్రాలూ నెల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఇప్పటికే వరుడు కావాలెను మూవీని దసరా రేసులో నిలబెట్టడం తెలిసిందే. అక్టోబరు 15న దసరా రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడు లక్ష్య సినిమాకు కూడా విడుదల తేదీని ప్రకటించారు.
నవంబరు 12న లక్ష్యం థియేటర్లలోకి దిగబోతోంది. లవ్ స్టోరితో నిర్మాత అవతారం ఎత్తిన టాలీవుడ్ బిగ్ షాట్ సునీల్ నారంగ్ నిర్మించిన రెండో చిత్రమిది. ఇంతకుముందు సుమంత్‌తో సుబ్రహ్మణ్యపురం సినిమా తీసిన సంతోష్ జాగర్లమూడి నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. ఇందులో పార్థు అనే ఆర్చర్ పాత్రను పోషిస్తున్నాడు శౌర్య. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలొచ్చాయి కానీ… ఆర్చరీ నేపథ్యంలో ఎవరూ ఇంతవరకు సినిమా తీయలేదు.
ఈ సినిమా కోసం శౌర్య సిక్స్ ప్యాక్ చేసి, విభిన్నమైన లుక్‌లోకి మారాడు. దీని ఫస్ట్ లుక్ వారెవా అనిపించింది. రొమాంటిక్ మూవీతో కథానాయికగా పరిచయం అవుతున్న కేతిక శర్మ ఇందులో హీరోయిన్గా నటించింది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్నందించాడు. పవన్ కళ్యాణ్ మాజీ మిత్రుడు శరత్ మరార్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.