రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పోటీచేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ లోక్ సభ స్థానం నుంచి నాగ్ ను సీఎం జగన్ బరిలోకి దించబోతున్నారని సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన మీడియా ఛానెళ్లలోనూ పుకార్లు షికారు చేశారు. అయితే, రాజకీయాలపై నాగార్జునకు ఆసక్తి లేదని, దీంతో, ఇలా ముందుగానే ప్రచారం జరిపించి నాగార్జున బుక్ చేయాలన్ని యోచనలో వైసీపీ నేతలున్నారని టాక్.
2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు వైసీపీకి దక్కలేదని, దీంతో, అందని ద్రాక్షగా ఉన్న ఆ స్థానాన్ని గెలుచుకునేందుకు నాగార్జునే సరైన వ్యక్తి అని జగన్ భావిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక, వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు వైఎస్ జగన్ తోనూ నాగార్జునకు మంచి సంబంధాలున్న నేపథ్యంలో నాగార్జున కూడా జగన్ ప్రపోజల్ కు ఓకే చెప్పే చాన్స్ ఉందని పుకార్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీకి ‘ఘోస్ట్’ సపోర్టర్ గా ఉన్న నాగ్..ఈసారి రంగంలోకి డైరెక్ట్ గా దిగబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆ పుకార్లపై నాగార్జున స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదని నాగార్జున తేల్చి పడేశారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అంతేకాదు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాగే ప్రచారం చేస్తున్నారంటూ నాగ్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.
వాస్తవానికి, నాగార్జున ఎప్పుడూ రాజకీయాల్లో కాలు కాదు కదా…వేలు కూడా పెట్టలేదు. వైఎస్ తోగానీ, జగన్ తో గానీ, కేసీఆర్, కేటీఆర్ లతో గానీ నాగ్ వి కేవలం వ్యాపార, సినీరంగ సంబంధాలే తప్ప రాజకీయ కోణం లేదు. అందుకే, గతంలోనే నాగ్ ను వైసీపీ తరఫున బరిలోకి దించాలని జగన్ ప్రయత్నించినా…నాగ్ సున్నితంగా తిరస్కరించారట.