దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ హీరో నాగ చైతన్యల విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లిన సమంతకు తన విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక, తాజాగా బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’లో ప్రమోషన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నాగచైతన్యకు కూడా అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత గురించి తాజాగా చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన మాజీ భార్య సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవముందని, సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని చైతూ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. పరస్పర అంగీకారంతోనే తాము విడాకులు తీసుకున్నామని నాగచైతన్య చెప్పాడు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నామని, కానీ, ఈ విషయంలో పనిగట్టుకుని కొందరు ఏవేవో ఊహాగానాలు సృష్టించారని అసహనం వ్యక్తం చేశాడు. ఇక, బాలీవుడ్ నటితో చైతూ ప్రేమయాణం గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతుండగా..వాటిపై చై స్పందించాడు.
తనపై వారానికో రూమర్ బయటకు వస్తుందని, తన లైఫ్‌కు సంబంధం లేని విషయాలపై ప్రచారం జరుగుతోందని అన్నాడు. అయితే, భవిష్యత్తులో మరోసారి తప్పకుండా ప్రేమలో పడతానని, భవిష్యత్‌లో ఏం జరగబోతోందోనని వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు. ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుందని, మనం జీవించేందుకు గాలి ఎంత అవసరమో.. అదేవిధంగా ప్రేమ కూడా అవసరమని చెప్పాడు చై. మనం ప్రేమించాలని.. ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలని, అలా జరిగితే లైఫ్‌లో ఎప్పటికీ పాజిటివ్‌గా ఉంటామని అన్నాడు.