జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులనుద్దేశించి ఏ సభలో ప్రసంగించినా సరే సీఎం సీఎం అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. పవన్ ను ముఖ్యమంత్రిగా జనసైనికులు చూడాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదు. సీఎం సీఎం అని నినాదాలు చేయడంలో కూడా తప్పులేదు. కానీ, కేవలం అలా నినాదాలు చేస్తే తాను సీఎం అయిపోనని, ఓట్లు వేయాలని గతంలో జనసైనికులను పవన్ కూడా పలు సందర్భాల్లో వారించారు.
సీఎం సీఎం అని కేకలు వేయొద్దని సీఎం అయ్యేందుకు జనసేనను గెలిపించుకునేందుకు అందరం కలిసి కష్టపడదామని పవన్ గతంలో చాలా సార్లు చెప్పారు. అయినా సరే వారి తీరు మారకపోవడంతో పవన్ చెప్పిన విషయాన్ని నాగబాబు మరికొంత ఘాటుగా చెప్పిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ ఫ్యాన్స్, జనసైనికులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో నాగబాబు అసహనానికి గురయ్యారు.
ఈరోజు చరణ్ బర్త్ డే వేడుకల కోసం వచ్చామని, కాబట్టి చరణ్ కు మొదటి గౌరవం ఇవ్వడం మన సంస్కారం అని సున్నితంగా వారిని వారించారు. జనసైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని నాగబాబు ఘాటుగా చెప్పారు. కళ్యాణ్ బాబు గురించి కాసేపు ఆగి మాట్లాడతానని, ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుందని అన్నారు. ప్లీజ్ దయచేసి కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి…దండం పెడతా అని రిక్వెస్ట్ చేశారు.
అయినా సరే, బాల్కనీలో ఉన్న కొందరు పవన్ అభిమానులు, జనసైనికులు పదేపదే పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలు చేస్తుండడంతో నాగబాబు సహనం కోల్పోయారు. తాను చెప్పిన తర్వాత కూడా మళ్లీ అరుపులు నినాదాలు వినిపించడంతో నాగబాబు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కూడా చాలా సార్లు చెప్పారు కదా సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎం చేయాలని అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం అని అరిస్తే సరిపోదని దమ్ముంటే ఎన్నికలలో పాల్గొని జనాలను చైతన్యవంతులను చేయాలని ఛాలెంజ్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత కాస్త కోపాన్ని తగ్గించుకొని పవన్ గురించి మాట్లాడడానికి వచ్చానని నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏదేమైనా జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ప్రవర్తనతోపాటు వారిపై నాగబాబు రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ గా మారాయి.