హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. చిరుకు ఫోన్ చేసి మాట్లాడంటూ గరికపాటికి చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవానీ శంకర్ కూడా డిమాండ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక, ఈ వ్యవహారంపై నాగబాబు కూడా ట్వీట్ చేయడంతో వివాదం ముదిరి పాకానపడింది. ఈ క్రమంలోనే చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గరికపాటి ఎపిసోడ్ పై నాగబాబు మరోసారి స్పందించారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నామని అన్నారు.
కానీ, గరికపాటివంటి పండితుడు అలా అనకుండా ఉండాల్సిందని, ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని మాత్రమే తాము భావించామని నాగబాబు అన్నారు. అంతేగానీ, ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవాలని తాము అనుకోవడంలేదని నాగబాబు క్లారిటీనిచ్చారు. మెగా అభిమానులు గరికపాటిని అర్థం చేసుకోవాలని, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. మరి, నాగబాబు రిక్వెస్ట్ తో మెగా ఫ్యాన్స్ సైలెంట్ అవుతారా లేక బహిరంగంగా గరికపాటి క్షమాపణలు చెప్పేదాకా వదలరా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు, గరికపాటికి మద్దతుగా మెగా అభిమానులపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. గరికపాటి వంటి వ్యక్తిని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గరికపాటి గారు అవధానం చేస్తున్నపుడు ఫొటో సెషన్ చేయడం సరికాదని, అందుకే , ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అంటున్నాయి.