ఏపీ సీఎం జగన్ పై జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మహానటుడని, ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని బయటకు గెంటేసిన స్వార్ధపరుడని షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత తండ్రి ఫోటోను జగన్ పక్కన పడేశారని విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ప్రజల బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు వదిలారని, వాటిని సహజ మరణాలని జగన్ అసెంబ్లీలో ప్రకటించారని దుయ్యబట్టారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమిదే విజయమని సర్వేలన్నీ చెబుతున్నాయని నాగబాబు అన్నారు. గంజాయి అక్రమ రవాణాలో అనకాపల్లికి చెందిన స్థానిక మంత్రి ప్రమేయం ఉందని నాగబాబు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే వైసీపీ నేతల చెంపలు వాయించాలని పిలుపునిచ్చారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం చేకూర్చిన వారిని, భూకబ్జాలు చేసిన వారిని జైలుకు పంపిస్తామని హామీనిచ్చారు.
వైసీపీ హయాంలో 35వేల మంది మహిళలు మాయమయ్యారని, వారిలో 25 వేల మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు. ఆ విషయంపై జగన్ ఒక సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లా అండ్ ఆర్డర్ కఠినతరం చేసి తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.