సీఎం జగన్, వైసీపీ నేతలపై మెగా బ్రదర్ నాగబాబు సందర్భానుసారంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంత్రి పదవి దక్కని వైసీపీ ఎమ్మెల్యేలపై నాగబాబు వేసిన సెటైర్లు వైరల్ అయ్యాయి. మంత్రి పదవులు రాక చూపిస్తోన్న ఫ్రస్ట్రేషన్, బాధను…రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాల్లో చనిపోయిన ప్రజలు, ఉద్యోగాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపుమంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు వంటి విషయాల్లో చూపిస్తే బాగుంటుందని నాగబాబు చురకలంటించారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై నాగబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే… మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం’ అంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాగబాబు చేసి ట్వీట్ వైరల్ అయింది. అంతకుముందు, కూడా పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై నాగబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా, అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే అది చెడ్డదని రుజువవుతుంది అంటూ డా.బీ ఆర్ అంబేడ్కర్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగటం లేదని, తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే, ఆ కర్రతో అయినా ఫ్యాన్ తిప్పుకుంటారని గతంలో నాగబాబు ఏపీలో విద్యుత్ కోతలపై స్పందిస్తూ సెటైర్లు వేశారు. ఎందుకంటే ఫ్యాన్ తిరగకపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందేనంటూ వైసీపీ నేతలనుద్దేశించి నాగబాబు చురకలంటించారు. మరి, నాగబాబు కామెంట్లకు వైసీపీ నేతల కౌంటర్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.