ఈసారి వేసవికి చాలా ముందుగానే బెర్తులు ఖరారైపోయాయి. ప్రతి వారం క్రేజీ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ‘వకీల్ సాబ్’తో వేసవికి అదిరే ఆరంభం లభిస్తుందని.. ఆ తర్వాత వచ్చే సినిమాలు సందడి మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆశించారు అభిమానులు. కానీ ‘వకీల్ సాబ్’ అడుగు పెడుతున్న వేళ.. దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేశారు. పరిస్థితి చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే 50 శాతం ఆక్యుపెన్సీ తప్పదేమో అనిపిస్తోంది. జనాల్లో కూడా మళ్లీ కరోనా భయం మొదలై థియేటర్లకు రావడం తగ్గించేస్తారేమో అన్న ఆందోళన ఉంది. ‘వకీల్ సాబ్’కు విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల జనాలు తగ్గట్లేదు.
కానీ.. తర్వాతి సినిమాల విషయంలో ఇలాగే ఉంటారన్న గ్యారెంటీ లేదు. వచ్చే వారం నుంచి కచ్చితంగా సినిమాలకు గడ్డు పరిస్థితులు మొదలవబోతున్నట్లే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16కు షెడ్యూల్ అయిన ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు వెల్లడైంది. వచ్చే వారానికి పరిస్థితులు సినిమా విడుదలకు ఏమాత్రం అనుకూలంగా ఉండవని, కాబట్టి సినిమాను వాయిదా వేసేద్దామని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత సునీల్ నారంగ్ డిసైడైపోయారు.
‘లవ్ స్టోరి’ని ప్రస్తుతానికి వాయిదా వేసి.. తర్వాత పరిస్థితులను బట్టి మే 7న రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. ‘లవ్ స్టోరి’ వాయిదా పడితే, పరిస్థితులు మున్ముందు కుదురుకోకుంటే తర్వాతి వారాల్లో వచ్చే టక్ జగదీష్, విరాట పర్వం, పాగల్ సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పనట్లే. మరి రాబోయే రోజుల్లో సినిమాల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.