వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్లు కూడా పెను వివాదాస్పదమవుతుంటాయి. పవన్ కన్నా వెనకొచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారని, కానీ, పవన్ మాత్రం తెలుగు అంటూ ఇక్కడే వేలాడుతున్నారని పవన్ సినీ కెరీర్ ను ఉద్దేశించి గతంలో వర్మ వివాదాస్పద కామెంట్లు చేశారు. మెగా ఫ్యామిలీలో బన్నీ మాత్రమే స్టార్ హీరో అంటూ మెగా ఫ్యామిలీని కూడా వర్మ గతంలో గెలికారు.
ఇక, జనసేన అధినేతగా పవన్ పొలిటికల్ కెరీర్ పై కూడా వర్మ షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. జనసేన ప్రచార రథం వారాహి పై కూడా వర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవిత్రమైన అమ్మవారికి..పందికి తేడా తెలియని స్థితికి వర్మ దిగజారిపోయారంటూ జనసైనికులు, పవన్, మెగా అభిమానులు వర్మకు కౌంటర్లు ఇచ్చారు. అయినా సరే వర్మ మారలేదు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి పవన్ కు వర్మ ఇచ్చిన సలహా ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కు నాదెండ్లను దూరంగా ఉంచాలంటూ ఉచిత సలహా ఇచ్చారు వర్మ. అంతేకాదు, నాదెండ్లకు దూరంగా ఉండాలని పవన్ కు సూచించాలంటూ జనసైనికులకు సూచించారు వర్మ. ‘‘ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని ,వెన్నుపోటు #NadendlaBhaakerRao కొడుకు #NadendlaManohar కి దూరంగా వుండమని చెప్పండి ..ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన #RajuRaviTeja గురించి ఇలాగె వార్నింగ్ ఇచ్చాను…నా మాటే నిజమైంది #JaiJanaSena’’ అని వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
దాంతోపాటు, ‘‘ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్ , ఎన్టీఆర్ ని #నాదెండ్లభాస్కర్రావు , ఎన్టీఆర్ ని మళ్ళీ @ncbn వెన్ను పోటు పొడిచినట్టే ఈసారి @pawankalyanని #నాదెండ్లమనోహర్,@ncbnఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు’’ అని వర్మ చేసిన ట్వీట్ పై టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వర్మకు సినిమాలు లేక, తీసిన సినిమాలు ఆడక, పనీ పాటా లేక ఇలా పబ్లిసిటీ కోసం పిచ్చి ట్వీట్స్ పెడుతుంటాడని విమర్శిస్తున్నారు.