సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ అస్తవ్యస్థ పాలన, ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వస్తోంది. కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు….ఉన్న సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అయితే, గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్టు…ఏపీకి రూపాయి పెట్టుబడులు తీసుకురాని జగన్…హెలికాప్టర్ లో తిరగడానికి మాత్రం కోట్లు తగలబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ బేసిక్ పే ఒక్క రూపాయి అని, కానీ, ఎయిర్ అలవెన్స్లు మాత్రం దాదాపు 50 కోట్ల వరకూ ఉంటాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో పర్యటనల కోసం రూ.32 కోట్లు ఖర్చు పెట్టి రూ.1.39 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని, కానీ జగన్ 40 నెలల్లో దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా సరే తీరు మారని జగన్ తాజాగా 28 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ లో వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తాడేపల్లి నుంచి తెనాలికి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణించిన వైనంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. జగన్ పాలనలో గుంతలు పడ్డ రోడ్లపై అవస్థలు పడున్న జనాన్ని పట్టించుకోని జగన్ హెలికాప్టర్లలో తిరుగుతున్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ నుంచి తెనాలి కేవలం 28 కిలోమీటర్ల దూరం అని, ఆ కాస్త దూరం కూడా రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని సెటైర్లు వేశారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, ప్రజల పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ఇలా ముఖ్యమంత్రి హెలికాప్టర్లకు ఖర్చుపెట్టడమేంటని నాదెండ్ల నిలదీశారు. ఆ డబ్బుతో రోడ్లు బాగుచేయించవచ్చని హితవు పలికారు.
తెనాలి టూర్ సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమేంటని పోలీసులను నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలన్నా జగన్ కు భయమని, జగన్ టూర్ సందర్భంగా తెనాలిలో కర్ఫ్యూ వాతావరణాన్ని పోలీసులు తలపించారని విమర్శించారు.