షెడ్యూల్ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు ఎక్కువవుతున్నట్లే ఉంది. అందరికన్నా ముందుగా కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. దాదాపు నెలన్నరోజుల క్రితమే అభ్యర్ధులను కేసీయార్ ప్రకటించేశారు. ఇప్పటివరకు మిగిలిన పార్టీలు ఒక్కళ్ళంటే ఒక్క అభ్యర్ధిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అందరికన్నా అభ్యర్దులను ముందుగా ఎందుకు ప్రకటించారంటే ఒకటికి రెండుసార్లు ప్రచారం చేసుకునేందుకు, అసంతృప్తులను బుజ్జగించి దగ్గరకు తీసుకునేందుకు.
కేసీయార్ ఉద్దేశ్యం మంచిదే అయినా ఆచరణలో అది పెద్దగా వర్కవుటవటంలేదు. పైగా చాలా నియోజకవర్గాల్లో రివర్సు కొడుతోంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరమవుతున్నట్లు కేసీయార్ కు సమాచారం అందిందట. కారణం ఏమిటంటే గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటం, ముస్లిం అభ్యర్ధులకు పెద్దగా టికెట్లు ఇవ్వకపోవటంతో పాటు స్ధానికంగా చాలా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏల వైఖరితో ముస్లింలు పార్టీకి దూరమయ్యారట.
ప్రతినెలా పార్టీ పరిస్ధితిపై కేసీయార్ చేయించుకుంటున్న సర్వేల్లో ముస్లింలు పార్టీకి దూరమవుతున్నట్లు తెలిసిందట. బీఆర్ఎస్ కు దూరమవుతున్న ముస్లింలందరు ఏకతాటిపై కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని సర్వేల్లో తెలిసిందని సమాచారం. అందుకనే వెంటనే అలర్టయిన కేసీయార్ ముస్లింలను దగ్గరకు తీసుకోవాలని మంత్రులు, ఎంఎల్ఏలకు చెప్పినా ఉపయోగం కనబడటంలేదట. మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడాలని ముస్లిం నేతలకు కబురు చేస్తున్నా ఎవరూ స్పందించటంలేదట. దాంతో వీళ్ళతో లాభంలేదని ముస్లిం పెద్దలను ఆశ్రయిస్తున్నారట. అయితే ఇక్కడ కూడా పెద్దగా సానుకూలత కనబడటంలేదని పార్టీలో టాక్ వినబడుతోంది.
ఇక లాభంలేదని ఎంఐఎం ద్వారా ముస్లిం పెద్దలను మ్యానేజ్ చేయాలని కేసీయార్ అనుకుంటే ఇక్కడా కూడా ఉపయోగం కనబడటంలేదట. ముస్లిం పెద్దలు కూడా ప్రగతిభవన్ కు వచ్చి కేసీయార్ తో భేటీ అవటానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదని తెలిసింది. బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్న ముస్లింలందరు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారట. వివిధ కారణాల వల్ల ముస్లింల్లో కేసీయార్ పైన నమ్మకం తగ్గిపోయిందని దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన తప్పకుండా పడుతుందని చర్చ పెరిగిపోతోంది. అభ్యర్ధుల గెలుపోటముల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ల ప్రభావం ఉంటుందని అంచనా.