మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా ఉత్కంఠ పెంచుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే సమయంలో ఈ ఫలితాల వెల్లడి కూడా రాజకీయంగా మారింది. ఫలితాల వెల్లడి జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.
కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే.. 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్లోడ్ చేయించారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ ఎస్‌కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్డేట్ చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీకి ఆధిక్యం లభించినప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని సంజయ్ నిలదీశారు. ఈ క్రమంలోనే మొదటి, రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్డేట్ చేసేందుకు జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప.. రౌండ్లవారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడంలో సీఈవో విఫలమయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ ఎస్‌కు ఆధిక్యం వచ్చే దాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా అన్న ఆయన.. బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు.