అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో.. అతి చిన్న ఉప ఎన్నిక తర్జన భర్జనకు గురిచేస్తోంది. అందరం కలిసి ఒకే తాటిపై వెళ్లాలన్న స్పృహ లేకపోగా.. ఎవరికి వారు.. పార్టీపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తు న్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో.. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఇప్పుడు.. ప్రధాన సమస్యగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉండడం.. ఎవరికి టికెట్ ఇస్తే.. మరొకరు ఏం చేస్తారో.. అనే బెంగ పార్టీని వెంటాడుతోంది.
మునుగోడు కాంగ్రెస్‌లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా చాలానే ఉంది. వీరిలో కీలకమైన పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవికుమార్ సహా మరికొందరు ఉన్నారు. వీరితో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాజకీయ వ్యుహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే ఆశావాహుల బలాబలాలపై పీసీసీకి నివేదిక సమర్పించారు.
ఆశావాహులతో సమావేశమైన తర్వాత రెండు మూడు రోజులలో అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసు కుంటారు. ప్రజాదరణ, పార్టీ విధేయత, ప్రత్యర్థులకు గట్టీ పోటీ ఇవ్వగలిగే అభ్యర్థినే ఎంపిక చేయనున్నా రు. మునుగోడు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంది?. ఆయనతో పాటు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి వెళ్లారు? వారిలో ఓట్లు చీల్చగలిగే శక్తి ఎలా ఉంది?వంటి అనేక కారణాలపై దృష్టి పెట్టారు.
అదేసమయంలో మునుగోడు ఎమ్మెల్యే టికెటు కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు..? వారి బలాబలాలపై చర్చించారు. మునుగోడు అభ్యర్థి ఎంపిక హుజురాబాద్ మాదిరి చివరి క్షణంలో కాకూడదని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా అభ్యర్థి ఎంపిక పూర్తి కావాలని నేతలు చర్చించుకున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు తదితర అంశాలపైనా చర్చ పెట్టారు.
అయితే.. ఇంత చేసినా.. పార్టీలో ఆశావహులను మాత్రం కంట్రోల్ చేయకపోతే.. రెబల్స్‌గా మారే ప్రమాదం ఉందనేదికాంగ్రెస్ నేతలకు మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలి.. ఎలా వారిని సర్దుబాటు చేయాలనేది.. ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో ఈ విషయాన్ని అధిష్టానానికే వదిలేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.