కరోనా కాలంలో ఆదివాసీలను ఆదుకున్న కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కపై ప్రశంసల జల్లు కురిసిన సంగతి తెలిసిందే. ఓ ఎమ్మెల్యే హోదాలో ఉన్న సీతక్క సామాన్యురాలిగా మారి కాలినడకన కిలోమీటర్ల కొద్దీ నడిచి మరీ ఆదివాసీలకు నిత్యావరసరాలు, మందులు పంపిణీ చేసిన వైనంపై పార్టీలకతీతంగా నేతలంతా ప్రశంసించారు. గతంలో ఉద్యమంలో ఉన్న సమయంలో ఆదివాసీల హక్కుల కోసం సీతక్క పోరాడిన సంగతి తెలిసిందే.
అయితే, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆదివాసీలకు కష్టమొస్తే నేనున్నానంటూ ముందుకు వస్తుంటారు సీతక్క. ఈ క్రమంలోనే తాజాగా ములుగు జిల్లాలోని గిరిజన మహిళా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డీఆర్వోపై సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డీఆర్వోను తానైతే గొడ్డలితో నరికి చంపేదాన్నంటూ సీతక్క చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఆ డీఆర్వోను సస్పెండ్ చేయాలని, కఠినంగా శిక్షించాలని సీతక్క డిమాండ్ చేశారు.
గిరిజనుల జోలికి వస్తే గిరిజన పద్ధతిలో అధికారులను రాళ్లతో కొట్టి తన్ని తరమండని సీతక్క పిలుపునివ్వడం షాకింగ్ గా మారింది. అటవీ హక్కుల చట్టాలన్నీ పకడ్బందీగా అమలు చేయాలని, హరితహారం పేరుతో భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. గిరిజన దళిత రైతులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని, పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.