జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో వైసీపీ నేతలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కత్తిపూడి, పిఠాపురం, కాకినాడలో కొనసాగుతున్న వారామి యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. అయితే, వైసీపీ నేతలపై పవన్ వాడిన భాషపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ పై పవన్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు అనూహ్యంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం సంచలనం రేపుతోంది. పవన్ ను వీధి రౌడీతో పోల్చిన ముద్రగడం…ఆయన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయాలలో ఉన్న పవన్ ఈ తరహా వీధి రౌడీ భాష మాట్లాడడం ఏమిటని ముద్రగడ ప్రశ్నించారు.
తాటతీస్తా, గుండు గీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, మక్కెలిరగ్గొడతా, దరిద్రులు అంటూ పదేపదే పవన్ దుర్భాషలాడడాన్ని ముద్రగడ తప్పుబట్టారు. ఎమ్మెల్యేలను దూషిండంపై పవన్ ఫోకస్ పెట్టకుండా ఆ సమయాన్ని పార్టీ బలోపేతంపై పెట్టాలని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని పవన్ అంటున్నారని, అటువంటి సందర్భంగా తనను సీఎం చేయాలని పవన్ ఎలా అంటారని ప్రశ్నించారు. 175 స్థానాల్లో జనసేన పోటీచేస్తేనే పవన్ సీఎం సీటు కోరాలని అన్నారు.
కాపులను రెచ్చగొట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా పబ్బం గడుపుకుంటున్నానని పవన్ అన్న మాటలను ముద్రగడ తప్పు బట్టారు. ఈ లేఖ చూసిన పవన్ కళ్యాణ్ కు కోపం రావచ్చని , ఆయన అభిమానులు తనను చంపాలని కూడా చూడొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖలో సినీ నటుడు పవన్ కల్యాణ్ అని ముద్రగడ సంబోధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన అధినేతగా పవన్ ను ముద్రగడ గుర్తించడం లేదా అని సోషల్ మీడియాలో జనసైనికులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.