వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో అంటూ వైరల్ అయిన ఒక వీడియో ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, అది మార్ఫింగ్ చేసిన వీడియో అని గోరంట్ల మాధవ్ అంటున్నారు. తాను జిమ్ లో ఉన్నపుడు తీసిన వీడియోను మాధవ్ మీడియాకు చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెండు వీడియోలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.
మాధవ్ చూపించిన వీడియోలో ఆయన వీపు భాగాన్ని చక్కగా చూపించారని, సోషల్ మీడియాలోని వీడియాలో ఆయన శరీర ముందు భాగం, ఆ తర్వాత క్లైమాక్స్ సీన్ అని ఎద్దేవా చేశారు. కానీ, ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలంటూ మాధవ్ చాలా నిష్పక్షపాతంగా స్పందించారని, వీడియోను షేర్ చేసిన వారిపై, వీడియోను చూసిన వారిపై కేసులు పెడతానని ఫెయిర్ గా చెప్పారని చురకలంటించారు.
అయితే, వీడియోలను చూసిన వారిని అరెస్ట్ చేయాలంటే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు రాష్ట్రంలోని 4 కోట్ల మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని, జైళ్లు సరిపోవని ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు. అందుకే, పక్క రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఏది ఫేక్ వీడియోనో తెలిసిపోతుందని మాధవ్ ను ఇరకాటంలో పడేశారు. సీఎం జగన్ గారు మహిళలను ఎంతో గౌరవిస్తారని, 30 రోజుల్లో అన్ని శిక్షలు, అవసరమైతే ఉరిశిక్షను వేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి అని అన్నారు.
వీడియోలో ఉన్నది మాధవ్ గారే అనిపిస్తోందని, కానీ, టెక్నాలజీ ఎంతో పెరిగిందని, మనిషిని పోలిన మనుషులు కూడా ఏడుగురు ఉంటారని ఎద్దేవా చేశారు. ఒకవేళ వీడియో నిజం అని తేలితే సభ్యసమాజం మాధవ్ ను అసహ్యించుకుంటుందన్నారు. మాధవ్ తప్పు చేశాడని తేలినా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవచ్చని, ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చని చురకలంటించారు.
గతంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందని, ఆయన ఇప్పుడు మంత్రి అయ్యారని అంబటి రాంబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఆడియో కాల్ లో ఉన్నది అంబటి రాంబాబు గొంతేనా, కాదా అనే విషయంపై కనీసం విచారణ కూడా జరపలేదని చెప్పారు. అంతేకాదు, గోరంట్ల మాధవ్ వీడియోతో పాటు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల ఆడియోలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని రఘురామ డిమాండ్ చేశారు. ఒక ఎంపీ గుడ్డలు ఊడదీసుకుని కనిపించడమేంటని, ఇది పార్లమెంటుకే సిగ్గుచేటని అన్నారు. కాగా, గతంలో పార్లమెంటు ఆవరణలో రఘురామనుద్దేశించి గోరంట్ల మాధవ్ తొడగొట్టి, మీసం మెలేసి మరీ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.