నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దేశపు అత్యున్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రఘురామకు ఊరట లభించింది. దీంతో, శనివారం నాడు రఘురామ విడుదలవుతారని అంతా భావించారు. అయితే, రఘురామ విడుదలలో జాప్యం జరిగే అవకాశముందని తెలుస్తోంది. రఘురామ బెయిలుపై సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.
రఘురామ న్యాయవాదులకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇంకా అందలేదని, ఈ కారణంతోనే రఘురామ విడుదల ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కింది కోర్టులో సోమవారంనాడు రఘురామ తరఫున పూచీకత్తు సమర్పించేందుకు ఆయన తరఫు లాయర్లు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రఘురామ సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలోనే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. రఘురామకు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా సుప్రీంకోర్టు పలు సూచనలు జారీ చేసింది. విడుదల తర్వాత రఘురామ ఈ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియా, సోషల్ మీడియాలో మాట్లాడకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని, తన కాలి గాయాలను ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది.