సీఎం జగన్, ఏపీ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ ఎంపీ రఘురామ ఏబీఎన్, టీవీ5 చానెళ్ల నుంచి 8.8 కోట్ల రూపాయలు..అక్షరాల మిలియన్ యూరోలు తీసుకున్నారని జగన్ సర్కార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం రఘురామపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై ఆర్ఆర్ఆర్ సెటైరికల్ గా స్పందిస్తూ పంచ్ లు వేశారు. ఇలా యూరోల్లో నగదు బదిలీ చేసేవారే ఆ పద ప్రయోగాన్ని అఫిడవిట్ లో వాడినట్లుందని రఘురామ చురకలంటించారు.
మీడియాలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నామని, వారి కంటే తనకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు ఈ అఫిడవిట్ చెబుతోందని ఎద్దేవా చేశారు. తన ఫాలోయింగ్ ను బట్ట ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సాధారణంగా చాలా మంది మీడియా చానెళ్లవారు ప్రజా ప్రతినిధులను అడిగి వార్తలు వేయించుకుంటారని, ఎదురుడబ్బు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేయరని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలా దిగజారి మాట్లాడుతున్నారన్నది తనకు తెలియదని, తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు కొత్త వదంతి సృష్టించారురని అన్నారు. తన రాజీనామా ప్రసక్తే లేదని, తన సభ్యత్వం రద్దు అన్నది కల్ల అని ధీమా వ్యక్తం చేశారు. వారి అభియోగాలన్నీ అర్థంపర్థం లేనివని, లోక్‌సభ స్పీకర్‌కు దీనిపై వివరణ ఇస్తానని చెప్పారు. తమ ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో ఉన్నారని, తనపై అనర్హత వేటు వేసేందుకు రాజ్యసభలో నానా పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
తన అనర్హతపై అంత యాగీ చేస్తున్న విజయసాయి…జనసేన ఎమ్మెల్యే రాపాకతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని రఘురామ నిలదీశారు. అటువంటి వారు లోక్‌సభ స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మానవమాత్రుల వల్ల అయ్యే పనికాదని, అలా మాట్లాడగలగడం ఒక కళ అని చురకలంటించారు.
శ్రీరంగనీతులు చెబుతూ మరేదో పనిచేసే వారు స్పీకర్ ఓం బిర్లాను దుర్భాషలాడటం అన్యాయం అన్నారు. పొలం ఒక కులానికి… పుట్ర అందరికీ.. అన్నట్లుగా కార్పొరేషన్ పదవుల పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. కులాల కార్పొరేషన్లు మినహాయించి మిగిలిన ముఖ్యమైనవన్నీ ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు.