ఏఫీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కంట్లో నలుసులా మారిన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామపై చర్యలు తీసుకోలేక…పార్టీ నుంచి తీసేయలేక…అనర్హత వేటు వేయలేక జగన్ సతమతమవుతున్నారన్న టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే సందర్భానుసారంగా వైసీపీ సర్కార్ పై, జగన్ పై రఘురామ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో 20నిమిషాలపాటు భేటీ అయిన రఘురామ….ఏపీలో ఆలయాల దాడుల వ్యవహారంపై చర్చించి, షాను ఏపీకి ఆహ్వానించడంతో జగన్ కు చిర్రెత్తుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే జగన్ పై మరోసారి రఘురామ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన అధికారిని తొలగించడం అహంకారానికి నిదర్శనం అని పరోక్షంగా జగన్ పై ఆర్ఆర్ఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు.
అహంకారంతో కన్ను, మిన్ను కానకుండా ప్రవర్తిస్తే భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి రఘురామ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ చొరవ చూపాలని, ప్రధాని మోడీతో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశఆరు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని….ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంలో రాజీపడితే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్ఆర్ఆర్ హెచ్చరించారు. ఏపీలో రేషన్ డోర్ డెలీవరీలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు సరిచేసుకోవాలని, పేరుకే డోర్ డెలివరీ కానీ, వ్యాన్ల వద్ద ప్రజలు క్యూలో పడిగాపులు పడుతున్నారని విమర్శించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొట్టి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడం దారుణమని రఘురామ అన్నారు. అమరావతిలో రైతుల బాధలు వింటే బాధేస్తోందని, రైతులకు జగన్ న్యాయం చేస్తే బాగుంటుందని హితవు పలికారు.