మూర్ఘత్వానికి మానవ రూపం జగన్: లోకేశ్

ఏపీలో దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వంటి ఘటనల నేపథ్యంలో జగన్ సర్కార్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. జగన్ పై హిందూ సంస్థలు, పలు మఠాల అధిపతులు గుర్రుగా ఉన్నారని టాక్ వస్తోంది. చిన జీయర్ స్వామి కూడా ఆలయాలపై దాడుల విషయంలో జగన్ ఉదాసీన వైఖరి వీడకుంటే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీలో తాజాగా ఇపుడు మరికొన్ని విగ్రహాల ధ్వంసం జరుగుతున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ విగ్రహం ధ్వంసం ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జ‌గ‌న్ అని, మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడని లోకేశ్ ధ్వజమెత్తారు.


"పరిపాలన రాజధాని అంటే ఇలా ఒక్కొక్క పరిశ్రమను అమ్మేయడమేనా? అడవులు, కొండల్ని కబ్జాలు చేయడమేనా? కాకినాడ పోర్టును విజయసాయిరెడ్డి అల్లుడికి వరకట్నంగా రాసిచ్చేశారు. విశాఖ ఏజెన్సీలోని లేటరైట్ గనులను బాబాయ్ సుబ్బారెడ్డికి బహూకరించారు. తన దోపిడీ మత్తుకు మంచింగ్ గా మచిలీపట్నం పోర్టును నంజుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకు కొని దోపిడీ వికేంద్రీకరణ పరిపూర్ణం చేసుకోబోతున్నారు" అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసిన వైసీపీ గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడిందని,స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చెరిగిపోయే చరిత్ర కాదని లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించిన లోకేశ్...విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ గ్యాంగ్ అని ఆరోపించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని, అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని లోకేశ్ అన్నారు. విశాఖ ఉక్కును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు.ఏపీకి మణిహారం వంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే జగన్ రెడ్డి మౌనం దాల్చడం దేనికి సంకేతం? అని లోకేశ్ ప్రశ్నించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? అని, విశాఖ స్టీల్ అమ్మేస్తుంటే వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీశారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.