తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. నవ రత్నాలు పేరుతో జగన్ మునుపే సీఎం చేయని విధంగా గడపడగడపకు ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. అయితే, సామాజిక పెన్షన్ల నగదును పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్…పెన్షనర్ల సంఖ్యను తగ్గించుకుంటూ పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలన్నీ త్వరలోనే.. నవ రంధ్రాలవుతాయని రఘురామ ఎద్దేవా చేశారు. నవరత్నాలలో ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందోనని ప్రజలకు భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. పెన్షన్లను తొలగించాలని చూస్తున్నారని, ప్రభుత్వం ఉన్నది వ్యాపారాలు చేయడానికి కాదని హితవు పలికారు.
ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద వాహనాలు ఇస్తున్నారని, చమురు ధరలపై టాక్స్‌లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి గురించి పట్టించునే నాథుడే లేడని దుయ్యబట్టారు. ఈ కారణాలతో డ్రైవర్లకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అన్నారు. ఇక, ఏపీ ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్‌వో లైసెన్స్‌ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
తెలంగాణలో గవర్నర్ కూడా పాల్గొని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటే.. ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. చవితి వేడుకల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్నారని, ఆదివారం చర్చిల్లో ప్రార్థనలకూ ఈ నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించారు. క్రైస్తవుల మాదిరిగానే హిందువులకూ పూజలు చేసుకునే అనుమతివ్వాలని కోరారు. ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, హిందూ ఆలయాల మీద పడి నాశనం చేయొద్దని అన్నారు.