జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ బెయిల్ రద్దు కాబోతోందని తొందర పడి ముందే కూసిన కోయిల మాదిరిగా…కొద్ది రోజుల క్రితమే సాక్షి మీడియాలో రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన పిటిషన్ కొట్టివేతపై రఘురామ తొలిసారిగా స్పందించారు.
సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళతానని రఘురామ అన్నారు. వచ్చే వారంలో హైకోర్టులో ఈ వ్యవహారంపై అప్పీల్ చేస్తానని చెప్పారు.
సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే ఊహించానని తెలిపారు. గతంలో సాక్షి ప్రకటించిన విధంగానే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.
గత నెల 25వ తేదీనే ఈ తీర్పు వస్తుందని తనకు అర్థమయిందని రఘురామ అన్నారు. ఒకవేళ సీబీఐ కోర్టులో ఈ రోజు తాను నెగ్గి ఉంటే…జగన్, విజయసాయిరెడ్డిలు హైకోర్టుకు వెళ్లేవారని అన్నారు.
కాకపోతే, తాను ఇప్పుడు హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. ఒకవేళ, హైకోర్టులో కూడా వారికి అనుకూలంగానే తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడతానని అన్నారు. మరోవైపు, అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని రఘురామ ఆకాంక్షించారు. బొత్స కరోనాబారిన పడ్డారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని రఘురామ ఆకాంక్షించారు.
సీపీఐ నారాయణ ఈ మధ్య ప్రజా సమస్యలు పెద్దగా పట్టించుకోవడం లేదని, బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అనడం మంచిది కాదని రఘురామ తప్పుబట్టారు. సజ్జనార్ వంటి పోలీసు అధికారులు ఏపీకి అవసరమని, ఎవరిని పడితే వారిని డెప్యుటేషన్‌పై తీసుకురావడం సరికాదని అన్నారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో అమ్మేందుకు కంప్యూటర్ ఆపరేటర్ని నియమిస్తారా? అని ఎద్దేవా చేశారు.