సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హత అనే పదాన్నిజగన్ పదిసార్లు సరిగ్గా పలికితే తనపై అనర్హత పడినట్లే భావిస్తానంటూ జగన్ కు సవాల్ విసిరారు రఘురామ. తాను రాజీనామా చేసి నర్సాపురం నుంచి మరలా పోటీ చేసి గెలుస్తానని, తాను గెలిస్తే జగన్ రాజీనామా చేసి భారతి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డిలో ఒకరికి సీఎం పదవి ఇవ్వాలని సూచించారు.
అలా చేస్తేనన్నా ప్రజలకు కాస్తైనా ఉపశమనం లభిస్తుందని సెటైర్లు వేశారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. గెలిచిన సీటులోనే మళ్లీ పోటీ చేస్తానన్నారు నరసాపురంలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, వాళ్ల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఫిబ్రవరి 5లోపు తనపై వేటు వేయించకపోతే వైసీపీ నేతలకు ధైర్యం లేదని, చేతగాదని భావించాల్సి వస్తుందన్నారు. ఏపీలోని మద్యంలో ప్రమాదకర రసాయనాలున్నాయని, దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ ను చేరాల్సిన చోటుకు చేర్చానని తెలిపారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఇలా చేస్తున్నాన్నారు. జగన్ తనకు విధించిన అరణ్యవాస శిక్షను రాష్ట్ర ప్రజల కోసమే వినియోగిస్తున్నానని చెప్పారు. 10వ తేదీ వచ్చినా 50శాతం మందికి పెన్షన్లు, 30శాతం మందికి జీతాలే రాలేదని ఆరోపించారు. ఇది కూడా ఒక పాలనేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్య దోపిడీ, ఆర్ధిక దోపిడీ జరుగుతోందని, రోడ్లు వేయడానికి కూడా జగన్ దగ్గర డబ్బుల్లేవన్నారు. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కడుపు మండిన ప్రజల ప్రతినిధిగా తాను ప్రశ్నిస్తున్నానని, అలా ప్రశ్నిస్తే కూడా రాజద్రోహమా? అని నిలదీశారు.