వైసీపీ మాజీ నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కొద్ది రోజుల క్రితం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం లోక్ సభ టికెట్ బాలశౌరికి కేటాయించబోనని జగన్ తేల్చి చెప్పడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పవన్ నివాసానికి వెళ్లిన బాలశౌరి ఆయనతో సమావేశమయ్యారు.
జనసేనలో చేరికకు ముహూర్తం, ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయాలపై చర్చించేందుకు పవన్ ను ఆయన కలిసినట్లు తెలుస్తోంది. మరోసారి మచిలీపట్నం ఎంపీగా తాను పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే, టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో బాలశౌరికి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన బాలశౌరి విజయం సాధించారు. అయితే, మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో ఆయనకు విభేదాలున్నాయి. ఇక, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు కూడా బాలశౌరితో సత్సంబంధాలు లేవు. ఈ క్రమంలోనే బాలశౌరికి టికెట్ నిరాకరించారు. దీంతో, ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారు.