మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో అనుమానితుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివ శంకరరెడ్డి అలియాస్ దొండ్లవాగు శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు పులివెందుల కోర్టు ఆవరణలో శంకర్ రెడ్డిని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులపై అవినాశ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. శంకర్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేని సమయంలో ఆయనను ఎలా అరెస్టు చేస్తారని అవినాశ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోర్టుకు అవినాశ్ రెడ్డి రావడంపై సీబీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు అక్కడున్న న్యాయవాదులు సర్దిచెప్పి వ్యవహారం సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, శంకర్ రెడ్డిని రిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం పులివెందులకు తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు శంకర్ రెడ్డిని హాజరుపరచగా…ఆయన శంకర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. సరిగ్గా ఈ సమయంలోనే కోర్టు ప్రాంగణానికి అనినాశ్‌రెడ్డి చేరుకున్నారు. శంకర్‌రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన అవినాశ్ రెడ్డి…ఆ తర్వాత ఈ అరెస్టుపై సీబీఐ అధికారులతోనూ విడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
మొత్తంగా అవినాశ్ రెడ్డి సుమారు అరగంటపాటు కోర్టు ఆవరణలోనే ఉన్నారు. 4.40 గంటల తరువాత తన వాహనంలో అవినాశ్ కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. కడప రిమ్స్ ఆస్పత్రిలో కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైసీపీ నాయకులు కొందరు శంకర్‌రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, పులివెందుల కోర్టుకు శంకర్‌రెడ్డిని తీసుకొచ్చినప్పుడు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకర్ రెడ్డి ఉన్న వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు, శంకర్ రెడ్డి అనుచరులు అడ్డుకోబోగా… పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం శంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఇక, శంకర్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఉందని, కస్టడీకి అప్పగించాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.