మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ తాజాగా కీలక అరెస్టును చేసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించే.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఈ అరెస్టు కీలకంగా మారనుంది.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు.. అవినాష్.. శివశంకర్ రెడ్డిలతో పాటు ఘటనాస్థలానికి ఉదయ్ కూడా వెళ్లినట్లుగా చెబుతున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని తరలించేందుకు వినియోగించిన అంబులెన్సు.. ఫ్రీజర్.. వైద్యులను రప్పించటంలో ఉదయ్ కీలక భూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డినే వివేకా భౌతిక కాయానికి కట్లు కట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి జయప్రకాశ్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేక్ అవుట్ టెక్నాలజీ సాయంతో ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వెంటనే రంగంలోకి దిగి.. అతన్ని అదుపులోకి తీసుకొని.. పులివెందుల జైలులోని గెస్టు హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడ విచారించనున్నారు. అయితే.. ఉదయ్ ను ఇంతకు ముందు కూడా సీబీఐ విచారించింది.కాకుంటే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి విచారణ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.