తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ….సినీ నటుల నుంచి రాజకీయ నేతల వరకు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. దిల్ రాజు, పవన్ కల్యాణ్, బండ్ల గణేష్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కరోనాబారిన పడ్డారు.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమించింది. సోమాజీగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మోత్కుపల్లిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారంనాడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మోత్కుపల్లి పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
తెలంగాణ టీడీపీలో మోత్కుపల్లి నరసింహులు కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. అయిేత, ఇటీవలే మోత్కుపల్లి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రులలో బెడ్ లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.