వైసీపీ పాలనలో ప్రజలపై పన్నులు, ట్యాక్సుల భారం పెరిగిందన్న సంగతి తెలిసిందే. భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ బాదుడు మొదలు పెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటితో పాటు సామాన్య ప్రజలపై భారం పడే ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు కూడా పెంచేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో డబుల్ లైన్ రోడ్లన్నింటికీ టోల్ వసూలు చేయబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ, ఇకపై ఏపీలో రాష్ట్ర రహదారులకు, డబుల్ లైన్ ఉన్న ప్రతీ రోడ్డుకి టోల్ పెట్టి ‘టోల్’తో ప్రజల ‘తోలు’ తీయనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఓ టోల్ గేట్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఏప్రిల్ 1 నుంచి ఏపీలో కొన్ని రోడ్లపై టోల్ ట్యాక్స్ విధించబోతున్నారని తాజాగా ప్రచారం మొదలైంది.
ఏలూరు-జంగారెడ్డిగూడెం(51 కి.మీ), భీమవరం-ముదినేపల్లి(50 కి.మీ), కర్నూలు-దేవనకొండ(65 కి.మీ), చిత్తూరు-పుత్తూరు(64 కి.మీ), గుంటూరు-చీరాల(49 కి.మీ), కడప-పులివెందుల(65 కి.మీ), కడప-బద్వేల్-పోరుమామిళ్ల-తాటిచెర్ల(126 కి.మీ), ఒంగోలు-బేస్తవారిపేట(108 కి.మీ)…ఈ రోడ్లపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రోడ్లపై ప్రయాణించే ప్రజలు ఇకపై జగన్ టోల్ టాక్స్లు కట్టక తప్పదని ప్రచారం జరుగుతోంది. అయితే, ఏపీ చరిత్రలో నెవర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్ వంటి ఈ టోల్ ట్యాక్స్… ద్విచక్ర వాహనలకూ కూడా పెడతారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ప్రజలపై పన్నులు, ట్యాక్సులు వేసి వ్యూహాత్మకంగా ఆదాయం పెంచుకుంటున్న జగన్, కట్టె విరగకుండా,పాము చావకుండా ఖజానాను నింపుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహాలోనే ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.