ఇటీవలి కాలంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుల పేర్లు పలు వివాదాల్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను వ్యవహారంలో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ బీసీ సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇంతవరకు మోహన్ బాబుగానీ, విష్ణుగానీ ఆ విషయంపై స్పందించకపోగా…క్షమాపణలు చెప్పలేదు.
ఇక, జగన్ తో సినీ ప్రముఖుల భేటీకి తనకు ఆహ్వానం అందకుండా చేశారని, సన్నాఫ్ ఇండియా చిత్రంపై నెగెటివ్ ట్రోలింగ్ చేశారని, తనపై ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు కుట్ర చేస్తున్నారని మోహన్ బాబు ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన జన్మదిన వేడుకల సందర్భంగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని, కానీ, తనకు మాత్రం ఎవరూ ఉపయోగపడలేదని మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఎంతోమంది ఎన్నికల ప్రచారం చేయించుకున్నారని, కానీ, తనకు మాత్రం ఎవరూ ఏమీ చేయలేదని పలువరు రాజకీయ నాయకులనుద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.
జీవితమంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోందని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో శ్రమ ఉందని మోహన్‌బాబు అన్నారు. ఈ వేడుకల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జీఏఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.
మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని పండిట్ రవిశంకర్ ఆకాంక్షించారు. మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. అయితే, దాని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని అన్నారు. దీంతో, మోహన్ బాబు కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. జగన్ ను ఉద్దేశించే ఆయన ఈ రకంగా ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.