ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు. ఎన్నికల తర్వాత కూడా ఒక రెండేళ్లు జగన్‌తో మోహన్ బాబు చాలా సన్నిహితంగా ఉన్నట్లే కనిపించారు. కానీ ఈ మధ్య మోహన్ బాబు తీరు చూస్తుంటే జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లే కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ బిల్లుల విషయంలో పెద్ద గొడవే చేసిన మోహన్ బాబుకు.. ఆ తర్వాత కూడా పరిస్థితులు ఏమాత్రం మారకపోవడంతో చేదు అనుభవం ఎదురైనట్లుంది.
దీనికి తోడు ఎన్నికల్లో అంత కష్టపడి ప్రచారం చేస్తే జగన్ ఏమాత్రం గుర్తించి గౌరవించకపోవడం కూడా ఆయన అసంతృప్తికి కారణం అయ్యుండొచ్చు. అందుకే ఈ మధ్య ఆయన లాయల్టీస్ మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విశాల్ మూవీ ‘లాఠీ’కి సంబంధించి తిరుపతిలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో మోహన్ బాబు పరోక్షంగా ప్రభుత్వం మీద కౌంటర్లు వేయడం చర్చనీయాంశం అయింది.
పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోతున్నారంటూ ఆయన ఎవరి పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. ఎక్కువ శాతం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పని చేయాల్సిన బాధ్యత కొంతమంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌ల మీద ఉంటుందని.. కానీ కింది స్థాయిలో పని చేసే పోలీసులు ఏదైనా తప్పు జరిగినపుడు దానికి భిన్నంగా అబద్ధం చెప్పాల్సి వస్తుందని.. అలా కాకుండా వాళ్లు నిజం మాట్లాడితే పై అధికారులు వారిని ఉద్యోగం నుంచి తీసేస్తారని.. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోతున్నారని.. ఈ విషయాన్ని తాను ఓపెన్‌గానే చెబుతున్నానని.. కానీ తనకు పోలీసుల మీద గౌరవం ఉందని వ్యాఖ్యానించారు మోహన్ బాబు.
మోహన్ బాబు పర్టికులర్‌గా ఎవరి పేరూ చెప్పకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తూ ప్రతిపక్షాలతో పాటు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు పెరిగిపోతున్న తరుణంలో మోహన్ బాబు వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి కౌంటరే అన్న చర్చ నడుస్తోంది.
https://www.youtube.com/watch?v=pwOvfSBBkbA&ab_channel=MixedCinema