సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? వైసీపీలో ఉన్నారా? లేక మనసు మార్చుకున్నారా? ఇలాంటి సందేహాలు అనేకం హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం.. ఆయన గడిచిన ఏడాదిన్నర కాలంలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడమే! వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పడాలని, రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే.. రెడ్డి రాజ్యం రావాలని తపించిపోయిన నాయకుల్లో ఈయన ముఖ్యమైన నేత. తన మనసులో మాటలను ఆయన ఎక్కడా దాచుకోలేదు. బయటపడిపోయారు. చంద్రబాబు హయాంలో మనకు న్యాయం జరగడం లేదని ఆపార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే బాబుపై బహిరంగ విమర్శలు చేశారు.
వాస్తవానికి టీడీపీ నుంచి మోదుగుల రెండు సార్లు విజయం సాధించారు. 2009లో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కారు. 2014లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక య్యారు.
రెండు సార్లు ఆయన టీడీపీ తరఫునే విజయం సాధించారు. అయితే.. పార్టీలో తనను పక్కన పెట్టారని, రెడ్డి వర్గం కావడంతో తననుపట్టించుకోవడం లేదని ఆయన బహిరంగ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఆ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు. తాను కోరుకున్న టికెట్… గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ముఖ్యంగా గల్లా జయదేవ్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తానని ఆయన ప్రకటించి మరీ పోటీ చేశారు.
కానీ, గత ఏడాది ఎన్నికల్లో మోదుగుల ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి ఆయన వైసీపీలో ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. దీనికి కారణమేంటి? అనే చర్చ జోరుగా సాగుతోంది. మోదుగుల గెలిచి ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ, మోదుగుల ఓటమితో.. రెడ్డి సామాజిక వర్గంలో ఆయన ఒంటరి అయ్యారనే వాదన ఉంది. తన దూకుడు, ముక్కుసూటి తనం వంటివాటిని వైసీపీలో కొందరు రెడ్డి వర్గం నేతలే సహించలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా జగన్ కు సలహాదారులుగా ఉన్న కొందరు రెడ్లు.. మోదుగులను పట్టించుకోవడం లేదు.
అయినప్పటికీ.. అడపా దడపా.. కొన్ని కార్యక్రమాలకు హాజరైనా.. ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీలో తనను ఎదగనివ్వడం లేదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలోనే ఉన్నా.. మౌనంగా ఉంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా.. పార్టీ నేతలపై మాత్రం ఆగ్రహంతో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఎప్పటికి ఆయన కు సానుకూల పరిస్థితి ఏర్పడుతుందో చూడాలని అంటున్నారు మోదుగుల అనుచరులు.