ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రమాన స్వీకార వేడుకు అయిపోయిన తర్వాత సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. తన సోదరుడు చిరంజీవిని కలవాలని మోదీ ని పవన్ కోరారు. అయితే, పవన్ చేయి పట్టుకొని స్వయంగా చిరంజీవి దగ్గరకు వెళ్లిన మోడీ…అన్నదమ్ములిద్దరి చేతులు పైకెత్తి సభికులకు అభివాదం చేశారు.
మెగా సోదరులను ఆప్యాయంగా పలకరించిన మోదీ…ఓ వైపు మెగాస్టార్…మరోవైపు పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయ్ లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది.
అంతకుముందు సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలకు పోజిచ్చారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మెగా సోదరులు ఇద్దరినీ దగ్గరకు తీసుకున్న మోదీ.. వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, బాలకృష్ణ దగ్గరకు మోదీని చంద్రబాబు తీసుకువెళ్లారు. ప్రస్తుతం మెగా బ్రదర్స్ తో మోడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముగ్గురు మొనగాళ్లు అని, ముగ్గరు మెగాస్టార్లు ఒకే ఫ్రేమ్ లో అని మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.