ఏపీలో మరో 3 రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించిన బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై మోడీ విమర్శలు గుప్పించారు. తిరుపతి వెంకన్న స్వామికి ప్రణమిల్లుతున్నానని, ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్యను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు.
రాష్ట్రానికి రాయలసీమ ఎందరో ముఖ్యమంత్రులు అందించిందని, కానీ, ఇక్కడి ప్రజలకు ఏమి లభించింది అని ప్రశ్నించారు. అనేక ఖనిజాలు, గనులు ఉన్న రతనాల రాయలసీమలో అనేక సమస్యలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆకాంక్షలతో వైసీపీకి ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారని…కానీ, వారి నమ్మకాలను ఆ ప్రభుత్వం వమ్ము చేసిందని మోడీ మండిపడ్డారు.
వైసీపీ విశ్వాస ఘాతకానికి పాల్పడిందని, పేదల అభివృద్ధిని పట్టించుకోకుండా మాఫియాను అభివృద్ధి చేసిందని విమర్శించారు. వైసీపీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారని, ఇక్కడ ఒక రౌడీ రాజ్యం ఏర్పడిందని ఘాటుగా విమర్శలు చేశారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 30 గ్రామాలు నీట మునిగి 12 మంది మరణించారని, ఆ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఇసుక మాఫియాలకు స్థానిక ప్రభుత్వం మద్దతు లభిస్తుందని ఆరోపించారు. ఇసుక మాఫియా కౌంట్ డౌన్ మొదలైందని మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాకు చికిత్స చేస్తామని, అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆరోపించారు. రాయలసీమకు సాగునీటి సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించలేదని, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి తరఫున ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజంపేట లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా నిలుచున్న తన మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డిని, టీడీపీ అభ్యర్థి ప్రసాద్ రావును, తిరుపతి అభ్యర్థి వరప్రసాద్ ను తదితరులకు ఓటు వేసి ఎంపీలుగా గెలిపించి ఢిల్లీకి పంపాలని పిలుపునిచ్చారు.