ప్రజా ప్రతినిధులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కేసులు, విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు విచిత్రంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్లు, జడ్జీలు తదితర పబ్లిక్ సర్వెంట్ లపై పెట్టే అవినీతి కేసులను నియంత్రిస్తు కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పై క్యాటగిరిల్లోని వ్యక్తుల అవినీతిపై కేసులు నమోదు చేయాలంటే కనీసం డీజీ స్థాయి వ్యక్తికి మాత్రమే సాధ్యం.
సమాజాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటంటే అవినీతి. ఇందులో కూడా రాజకీయ అవినీతిని చూసుకునే మిగిలిన వ్యవస్ధల్లోని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడినా సరే సదరు వ్యక్తులకు రాజకీయ అండదండలు ఉంటే ఏమీ కాదనే బలమైన సంకేతాలు సమాజంలో కనిపిస్తున్నాయి. అంటే సకల అవినీతికి రాజకీయ అవినీతే మూలంగా అర్ధమవుతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1988లో తెచ్చిన అవినీతి నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలను నరేంద్ర మోడీ సర్కార్ 2018 లో సడలించి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది.
అంటే తాజా మార్గదర్శకాల ప్రకారం పై క్యాటగిరిల్లోని అవినీతిపరులపై కేసులు నమోదు చేయాలంటే డైరెక్టర్ జనరల్ (డీజీ) స్ధాయి ఉన్నతాధికారి మాత్రమే చేయగలరు. తనకు కింద నుండి వచ్చిన ఫిర్యాదును, ఆధారాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని అనుకుంటే మాత్రమే కేసు కట్టి దర్యాప్తుకు ముందుకెళతారు. ఒకవేళ తనకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు, విచారణ అవసరం లేదని అనుకుంటే ? అపుడేమవుతుంది ? అన్న విషయంలో మార్గదర్శకాలు స్పష్టంగా లేవు.
నిజానికి అవినీతికి పాల్పడే వారు తాము పట్టుబడకుండా, సాక్ష్యాలు దొరక్కుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకునే అవినీతికి లాకులెత్తుతారన్న విషయం కొత్తేమీ కాదు. ఉద్యోగుల అవినీతిలో ప్రజాప్రతినిధుల ప్రమేయం బయటపడటం, ఆధారాలు దొరకడం, సాక్ష్యులు ముందుకు రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకనే అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులు ఎలాంటి భయం లేకుండా యధేచ్చగా రెచ్చిపోతున్నారు. వీరికి అధికార యంత్రాంగం యధాశక్తి సహకరిస్తోంది.
అందుకనే నమోదవుతున్న అవినీతి కేసుల్లో అసలు విచారణ దశలోనే చాలావరకు వీగిపోతున్నాయి. వాస్తవం ఇలాగుంటే కొత్త మార్గదర్శకాలు అవినీతిపరులకు మరింత మద్దతుగా నిలుస్తున్నట్లున్నాయి. అసలు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జడ్జీలు, మంత్రులు, బ్యాంకుల ఎండిల్లాంటి ఉన్నతస్ధాయి వ్యక్తుల అవినీతి బయట పడేదెప్పుడు, కేసులు పెట్టేదెప్పుడు, దర్యాప్తు జరిగి అది రుజువయ్యేదెప్పుడు ? నమోదవుతున్న కేసులు లాజికల్ గా ముగిసే కేసులు చాలా తక్కువనే చెప్పాలి. వాస్తవాల ఇలా ఉంటే మరి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇంకెవరైనా అవినీతి చేసి పట్టుబడతారా ? అనుమానమే.