పెద్దనోట్ల రద్దుతో నరేంద్రమోడీ ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఏడాదిలోపు దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిల్లో ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలని ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి మోడీ గట్టిదెబ్బ కొట్టారు. రాజకీయాలు, ఎన్నికలంటేనే బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చులు, ఓటర్లకు పంచాల్సిన డబ్బంతా బ్లాక్ మనీయే అన్న విషయం తెలిసిందే. అధికారపార్టీ కాబట్టి బీజేపీ ఏదో పద్దతిలో మార్చేసుకుంటుంది.
బ్లాక్ మనీని ఖర్చుచేయాల్సిన ప్రతిచోటా పార్టీలు, నేతలు ఎక్కువగా పెద్దనోట్లను మాత్రమే పోగేసుకుంటాయి. ఈ పద్దతిలో రు. 2 వేల నోట్లను సిద్ధం చేసుకుంటాయి. ఏ ఎన్నిక తీసుకున్నా వేల కోట్లరూపాయల ఖర్చులు మామూలే. కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్క ప్రకారం ఒక ఓసీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక అభ్యర్ధి చేయాల్సిన ఖర్చు రు. 75 లక్షలు. అయితే పెట్టే ఖర్చు సుమారు రు. 120 కోట్లపైమాటే. కమీషన్ లెక్కప్రకారం చేసే ఖర్చు రు. 75 లక్షలంతా వైట్ మనీ అయితే అసలు ఖర్చు రు. 120 కోట్లు నూరుశాతం బ్లాక్ మనీ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇలాంటి ఖర్చుల కోసమే పార్టీలు ఇప్పటికే వేల కోట్ల రూపాయలను దాచుకుని ఉంటాయి. లేదా చేరాల్సిన ప్రాంతాలకు చేర్చేసుంటాయి. అలాంటిది ఇపుడు సడెన్ గా పెద్దనోట్ల రద్దంటే పార్టీలు, నేతలు పోగేసిన వేల కోట్ల రూపాయలంతా బూడిదగా మిగిలిపోతుంది. వేలకోట్ల రూపాయలను ఇప్పటికిప్పుడు మార్చుకోవటం, బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తలకుమించిన పననే చెప్పాలి. ఇస్తే బ్యాంకుల్లో ఇవ్వాల్సిందే కానీ మామూలు వాళ్ళెవరు తీసుకోరు.
కాకపోతే రద్దయిన పెద్దనోట్లను తీసుకుని తర్వాత మార్పిడి చేసుకునే ఏజెన్సీలుంటే కొన్నుండచ్చు. అవికూడా పెద్దనోట్లు తీసుకోవటానికి మార్పిడిలో సగం ధరమాత్రమే ఇస్తాయి. ఏదో పద్దతిలో వదిలించుకోవాలి కాబట్టి తమదగ్గరున్న బ్లాక్ మనీ మొత్తాన్ని ఏజెన్సీలకు ఇచ్చేస్తాయి. ఈ పద్దతిలో కూడా పార్టీలు, అభ్యర్ధులకు వేల కోట్లరూపాయల నష్టమే. బ్లాక్ మనీ అంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్, సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా చెలామణిలో ఉంటుంది. మరిపుడు బ్లాక్ మనీదారులంతా ఏమిచేస్తారో చూడాలి.