తాజాగా జరిగిన ఒక పరిణామం చూస్తుంటే ఇలాగే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి కమ్ రీసెర్చి సెంటర్లను నిర్మించింది. నిజంగా ఇది మంచి పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం లాంటి అనేక అంశాలు కారణాలవుతున్నాయి.
అందుకనే అణుపితామహుడు హోమీ భాభా పేరుతో క్యాన్సర్ ఆసుపత్రలు, రీసెర్చి సెంటర్లను నిర్మించింది. నిర్మించింది కేంద్రప్రభుత్వమే అయినా అందుకు అవసరమైన భూములు, మౌళిక సదుపాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చాయి. కాబట్టి ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ల ఏర్పాటు కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగిందనే చెప్పాలి. వీటన్నింటినీ ఒకేసారి నరేంద్రమోడీ గురువారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చినట్లు ప్రకటించారు.
ఇక్కడ విషయం ఏమిటంటే మోడీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన ఆసుపత్రుల్లో ఒకటి విశాఖపట్నంలో ఉంది. మోడీ వర్చువల్ గా ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ ను ప్రారంభించిన సమయంలో విశాఖపట్నంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అయితే హోమీభాభా ఆసుపత్రిని మోడీ ప్రారంభించిన విషయం కూడా జగన్ కు తెలీదట. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపైన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, సైన్స్ అండ్ డెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్లు మాత్రమే ఉన్నాయని సమాచారం.
శిలాఫలకం మీద జగన్ పేరులేదు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొనలేదు. అసలు మోడీ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేస్తున్నట్లు జగన్ కు సమాచారం ఉందో లేదో కూడా అనుమానంగానే ఉంది. మోడీ తాజా చర్యలతో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై మోడీ చూపిస్తున్న వివక్ష స్పష్టంగా కనబడుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై మోడీ వివక్ష చూపుతున్నారంటే అర్ధముంది. అలాగే నాన్ ఎన్డీయే ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కూడా వివక్ష చూపుతున్నారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ జగన్ కేంద్రానికి సంపూర్ణ మద్దతిస్తున్నారు. మరి ఏపీ విషయంలో కూడా మోడీ ఇంత వివక్ష చూపిస్తున్నారా?