దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు నరేంద్ర మోడీ. అందుకే.. స్వంత్రంత్య భారతంలో ప్రధానమంత్రులుగా ఎందరో ఉన్నా.. ఎవరికి దక్కని అపూర్వ ఆదరణ మోడీ సొంతంగా చెప్పాలి. అదే సమయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో మరెవరికీ లేనంత భిన్నాభిప్రాయం మోడీపైన ఉంటుందన్న విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే ఆయన.. తనకు అలవాటైన ప్యాట్రన్ ను ఫాలో అవుతారని చెప్పాలి.
2019 ఎన్నికల వేళలో.. దేశ ప్రజల చూపు తన మీద పడేలా.. ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేధార్ నాథ్ లోని ఒక గుహలోకి వెళ్లి కాసేపు ధ్యానం చేసిన వైనం తెలిసిందే. తాజా ఎన్నికల ముగింపునకు వచ్చిన వేళలో.. మళ్లీ అదే తరహా ద్రశ్యాన్ని రిపీట్ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏడు దశల్లో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. తుది విడత పోలింగ్ జూన్ ఒకటో తేదీన (శనివారం) జరగనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.
సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ తనదైన రీతిలో ఒక అథ్యాత్మిక యాత్రను చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఈసారి ఆయన సౌత్ ను ఎంచుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన దక్షిణాది మీద ఎక్కువ ఫోకస్ చేయటం తెలిసిందే. తాజాగా తన టూర్ కు కూడా సౌత్ ను ఎంచుకున్నారు.
గురువారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసినంతనే ఆయన తిరువనంతపురం నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకోనున్నారు. అక్కడ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లనున్నారు. అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేయనున్నారు. ఆ తర్వాత స్మారక మండపంలోని ధ్యానమందిరంలో ధ్యానంలో నిమగ్నం కానున్నారు.
అలా మొదలయ్యే ఆయన ధ్యానం జూన్ ఒకటి వరకు కొనసాగనుంది. అంటే.. దాదాపు రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో కన్యాకుమారిలో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల చివర్లో ఉత్తరాదిని ఎంచుకున్న ప్రధాని మోడీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా దక్షిణాదిని ఎంపిక చేసుకున్నారు. సేమ్ సీన్ కాకుంటే వెన్యూ మాత్రమే మారిందని చెప్పాలి.