- విశాఖ ఉక్కు ప్రైవేటుపరం
- ఆంధ్రా బ్యాంకు విలీనం
- పోలవరంపై దాగుడుమూతలు
- ప్రత్యేక హోదాపై మొండిచేయి
- రెవెన్యూ లోటుపై కాకిలెక్కలు
ప్రధాని మోదీ ఆంధ్రులపై కక్ష పెంచుకున్నారా..? నవ్యాంధ్రకు చేస్తున్న అన్యాయం చూస్తే అలాగే అనిపిస్తోంది. రాజధాని అమరావతిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగనే విషం కక్కుతుంటే.. కేంద్రం రాష్ట్ర ప్రజలకు మరింత కాలకూటం తినిపించేందుకు కంకణం కట్టుకుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి రెవెన్యూ లోటు వరకు.. ప్రత్యేక హోదా నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం వరకు.. అన్నింటా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కేంద్ర బడ్జెట్లో నవ్యాంధ్ర మెచ్చదగినట్లుగా పైసా ఇచ్చిన పాపాన పోలేదు.
పోలవరం ప్రాజెక్టుపై దాగుడుమూతలాడుతోంది. తుది అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా నానా కొర్రీలు వేస్తోంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్న సామెతను నిజం చేస్తోంది. అక్రమాస్తుల కేసుల బూచిచూపి జగన్‌ను గుప్పిట్లో పెట్టుకుంది. ప్రత్యేక హోదాను ఏనాడో అటకెక్కించింది. చంద్రబాబు హయాంలో అంగీకరించిన ప్రత్యేక ప్యాకేజీకి అతీగతీ లేదు. 2014-15లో రెవెన్యూ లోటు రూ.22,500 కోట్లను ఇంతవరకు భర్తీ చేయలేదు. కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వేసిన లెక్కలను కూడా పక్కనపెట్టి.. సొంతగా తీసివేతలు చేపట్టి ..మీకు రావలసింది రూ.4,500 కోట్లే.. అందులో 4,210 కోట్లు ఇచ్చేశాం.. ఇక ఇచ్చేది 290 కోట్లేనని తేల్చేసింది. ప్రతిపక్షంలో ఉండగా.. ఈ లెక్కలపై హుంకరించిన జగన్ ఇప్పుడు నోరెత్తితే ఒట్టు.
ఉన్నవి చేయదు.. లేనివి పట్టవు…
విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదు. అదేమంటే.. పదేళ్లలో అమలు చేయాలని చట్టంలో ఉంది.. ఇంకా సమయం ఉందని దాటవేస్తోంది. లేనివాటిని ప్రస్తావిస్తే చట్టంలో అది లేదు పొమ్మంటుంది. పైసా సాయం చేయకపోయినా ఫర్వాలేదు.. కానీ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవి కూడా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో కేంద్ర పెట్టుబడులను మొత్తం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దానిని జగన్‌కు అత్యంత ప్రియమైన పోస్కో కంపెనీకి కట్టబెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన, దశాబ్దాల చరిత్ర గలిగిన ఆంధ్రాబ్యాంకును తీసుకెళ్లి యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. దీనిపై ఉద్యమించాల్సిన జగన్.. ప్రైవేటీకరించవద్దని ప్రధానికి ఓ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై నోరెత్తవద్దని వైసీపీ ఎంపీలను ఆదేశించారు. వీరు మాట్లాడకపోయినా ఫర్వాలేదు.. కానీ మాజీ సీఎం చంద్రబాబు వల్లే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.
ఎంతోమంది త్యాగం…
విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తే బతుకులు బాగుపడతాయని భావించి ఎంతోమంది తమ జీవనాధారమైన భూములను ఇచ్చారు. కర్మాగారం వస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సభలు పెట్టి చెప్పడంతో…నిజమని నమ్మి ఆందోళనలు చేయకుండానే భూములను అప్పగించారు. ప్లాంట్ కోసం సర్వం త్యాగం చేసిన ఆ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేరనేలేదు.
భవిష్యత్తులో అయినా నెరవేరతాయేమో అన్న ఆశతో వారంతా ఇప్పటివరకూ ఎదురుచూశారు. ఈలోగానే ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే నిర్ణయం నిర్వాసితుల ఆ ఆశనూ చంపేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 1971లో 15 వేల ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరాకు రూ.1,200 చొప్పున నిర్వాసితులకు చెల్లించారు. ఆ మొత్తం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో రూ.3,000 చొప్పున ఇచ్చారు. ప్లాంట్ అవసరాల నిమిత్తం ఇంకా భూమి అవసరమని భావించి ఆ తర్వాత మరో 11 వేల ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఎకరాకు రూ.26 వేల వరకూ చెల్లించారు.
అలా.. నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో సుమారు 26 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే కార్డు(ఆర్-కార్డు) ఇచ్చారు. అది కూడా భూ సేకరణ సమయానికి మేజర్ అయ్యి వివాహం అయిన వారికి మాత్రమే ఇచ్చారు.
నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇవీ..
-ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఓ ఉద్యోగం
-చదువు లేని వారికి ప్లాంట్‌లో కూలి పని
-నిర్వాసిత కుటుంబానికి నిర్వాసిత కాలనీలో 107 గజాల స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వడం
-ప్లాంట్ నిర్మాణం చేయగా మిగులు భూములు ఉంటే, అప్పటికి మేజర్ అయిన పిల్లలకు అదనంగా మరో 100 గజాల స్థలం.
-నిర్వాసిత కాలనీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి
సగం మందికైనా నెరవేరని హామీలు..
నాడు సుమారు 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించినప్పటికీ 8,009 మందికి మాత్రమే ఇప్పటి వరకు ప్లాంట్‌లో ఉపాధి కల్పించారు. మిగిలినవారు ఇంకా ఉపాఽధి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నిర్వాసిత కాలనీలో 107 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, కొన్నిచోట్ల నమూనా ఇళ్లు నిర్మించారు. అవి సరిగా లేవని నిర్వాసితులు వ్యతిరేకించడంతో సామగ్రి ఇస్తామని చెప్పారు. ఇవి కూడా కొంతమందికి మాత్రమే అందాయి. నిర్వాసిత కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు.