కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన విధానాలపై ఓపక్క ప్రశంసలు.. మరోపక్క విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. విమర్శల్ని మోడీని వ్యతిరేకించేపార్టీలతో పాటు వామపక్ష భావజాలం ఉన్న వారున్నారు. ఇదేసమయంలో మోడీ అనుసరించిన విధానాలపై సోషల్ మీడియాలో బలమైన వాదనల్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి తమిళనాడుకు చెందిన 19 మఠాలకు చెందిన మఠాధిపతుల్ని ఆహ్వానించటం.. వారి నడుమ కొత్త భవనాన్ని ప్రారంభించిన తీరు అందరిని ఆకర్షిస్తోంది.
అంతే కాదు.. తమిళనాడుకు చెందిన 19 మంది మఠాధిపతులను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చి.. వారికి ప్రత్యేక వసతి సౌకర్యాల్ని కల్పించటంతో పాటు.. రాబోయే రోజుల్లో తమిళ మఠాధిపతులకు మద్దతు ఇస్తామని మోడీ హామీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మఠాధిపతులకు సాయంగా ఉండటానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను కేటాయించారు. అంతేకాదు.. వారితో మాట్లాడేందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తమిళం మాట్లాడే అధికారిని నియమించారు.
19 మంది మఠాధిపతుల్లో ఆరుగురు మఠాధిపతులు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజదండాన్ని బహుకరించారు.ఈ రాజదండంపై భారీ ఎత్తున విమర్శలతో కొందరు విరుచుకుపడుతున్నారు. వీరికి కౌంటర్లు అంతే స్థాయిలో వస్తుండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక టాప్ హోటల్ లో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన మఠాధిపతులకు బస కల్పించటంతో పాటు.. వారికి ఉల్లి.. వెల్లుల్లి.. మసాలాలు లేని శాఖాహారాన్ని వడ్డించేలా ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక క్యాటర్ ను ఏర్పాటు చేసి.. ప్రతి మఠాధిపతిని విడివిడిగా సంప్రదించి వారు తినేందుకువీలైన ఆహారాన్ని సిద్ధం చేశారు. ఢిల్లీకి వచ్చిన పందొమ్మిది మంది మఠాధిపతుల్లో కొందరికి ప్రత్యేకమైన ఆహార షెడ్యూల్ ఉంది. ఆ విషయాల్ని ముందే తెలుసుకొని.. వారి ఆచారాలకు ఎలాంటి భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. ధర్మపురం మఠాధిపతిగా వ్యవహరించే వారు వందల ఏళ్లుగా సూర్యాస్తమయానికి ముందు పూజ చేస్తారు. అనంతరం ఆహారం తీసుకుంటారు.అలాంటి వివరాల్ని తీసుకొని.. అందుకు ఇబ్బందులు ఎదురుకాకూడదన్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 1947లో ప్రధాని నెహ్రూకు సెంగోల్ (రాజదండం) ను అందించింది ఒక్క మఠాధిపతి అయితే.. ఇప్పుడు ఆరుగురు మఠాధిపతులు తమ చేతుల మీదుగా మోడీకి రాజదండాన్నిఅందించటం గమనార్హం. ప్రధానమంత్రి మోడీ స్వయంగా తమను పిలిపించి.. గౌరవించిన వైనం మఠాధిపతులకు ఉత్సాహాన్ని కలిగించినట్లుగా చెప్పారు. అంతేకాదు.. సెంగోల్ ను ప్రధాని మోడీ స్వయంగా లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ఉంచారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే క్రమంలో ప్రధాని మోడీకి రాజదండాన్ని (సెంగోల్) ఇచ్చేందుకు ధర్మవరం.. మదురై.. తిరువావడ్తురై.. కుండ్రకుడి.. పేరూర్.. వేలకుర్చి మఠాధిపతులు అందించారు. అయితే.. మఠాధిపతుల వెంట ఉన్న వేళలో..కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తీరును విపక్షాలకు చెందిన నేతలు తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే.