అంచనాలకు అందని రీతిలో నిర్ణయం తీసుకున్నారు మోడీషాలు. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు ముగింపు పలికారు. తాజా సీఎంను తామే డిసైడ్ చేసినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయించిన భావన కలగని రీతిలో.. సీల్డ్ కవర్ సీఎంను సరికొత్త పద్ధతిలో డిసైడ్ చేశారు. ఊహకు అందని రీతిలో తొలిసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన నేతను ముఖ్యమంత్రిగా డిసైడ్ చేశారు.
సీఎం పదవికి రాజీనామా చేసిన నేత చేత.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రతిపాదన చేసి మరీ డిసైడ్ చేసిన వైనం మెచ్చుకోవాల్సిందే. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు తగ్గట్లు కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వీలుగా కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించారు. ఇంతకూ ఆ నేత ఎవరంటారా? 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన 59 ఏళ్ల భూపేంద్ర పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉంటే.. అందులో బీజేపీ బలం 112 స్థానాలు. వారంతా ఆదివారం సాయంత్రం సమావేశమై.. తమ తదుపరి సీఎం ఎవరన్న విషయంపై నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ.. భూపేంద్ర పేరును ప్రతిపాదించగా.. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభాపక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్.. ప్రహ్లాద్ జోషీ.. సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎం ఎవరన్న దానిపై బీజేపీ శాసన సభా పక్షం నిర్ణయం తీసుకున్న తర్వాత.. భూపేంద్ర పటేల్ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తో భేటీ అయ్యారు.
తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలిపారు. రాజ్ భవన్ కు వెళ్లిన సమయంలో భూపేంద్ర వెంట.. నరేంద్ర సింగ్ తోమర్.. ప్రహ్లాద్ జోషీ.. విజయ్ రూపానీ.. సీఆర్ పాటిల్ తదితరులు ఉన్నారు. శాసనసభాపక్షం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2.20 గంటలకు భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా ఆయన ఒక్కరు మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారు.
అనంతరం రెండు మూడు రోజుల తర్వాత మంత్రులుగా ఎవరన్న అంశాన్ని డిసైడ్ చేసి.. వారి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్నారు. నిజానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రఫుల్ ఖోడా పటేల్.. మన్ సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీఎం పదవి ఖాయమని భావన వ్యక్తమైంది. అందుకు భిన్నంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతను ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
భూపేంద్ర పటేల్.. గుజరాత్ లో సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. వచ్చే ఏడాది డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీని విజయతీరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భూపేంద్ర మీద ఉందని చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.