తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. షర్మిల కారులో ఉండగానే ఆమె కారును ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేయడం, ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం సంచలనం రేపింది. ఈ వ్యవహారాన్ని స్థానిక మీడియా పెద్దగా హైలైట్ చేయకపోయినప్పటికీ, ఒక పార్టీ అధ్యక్షురాలు అయిన మహిళ నేతను కారులో ఉండగానే టోయింగ్ చేసిన వైనంపై జాతీయ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కథనాలు ప్రచురించింది.ఈ నేపథ్యంలోనే తాజాగా వైయస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడిన మోడీ ఇటీవల షర్మిల పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఆ ఘటనలపై షర్మిలతో మాట్లాడిన మోడీ…ఆమెకు ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఢిల్లీకి రావాలని షర్మిలను ప్రధాని మోడీ ఆహ్వానించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దీంతో, తనకు అండగా నిలిచి పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రధాని మోడీకి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలుస్తానని షర్మిల చెప్పారు. తాజా పరిణామాలతో షర్మిల…కేసీఆర్ వదిలిన బాణం అని జరుగుతున్న ప్రచారంపై సందిగ్ధత ఏర్పడింది. తాజాగా షర్మిలకు మోడీ ఫోన్ చేయడంతో ఆమె బీజేపీ వదిలిన బాణం అని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఆరోపిస్తున్నాయి.
ఇక, జగన్ తో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న షర్మిలకు మోడీ ఫోన్ చేయడంతో జగన్ కు షాక్ తగిలినట్లయింది. అంతేకాకుండా, కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్లుగా ఉంటూ ఆ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో షర్మిలకు మోడీ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.