తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఎప్పుడైతే బండిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారో అప్పటినుండే పార్టీలో పరిణామాలు చాలా హాటుహాటుగా మారాయి. దానికితోడు హనుమకొండ కోర్టు బండికి 14 రోజుల రిమాండ్ విధించటంతో వెంటనే మోడీ అర్జంటుగా రంగంలోకి దిగారట. అమిత్ షా, జేపీ నడ్దాను పిలిపించుకుని పరిస్ధితిని సమీక్షించారు. ఏ కారణంగా బండిని అరెస్టు చేశారు, అభియోగాలేమిటి ? ఆధారాలు ఏమిటనే విషయాన్ని మోడీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు, మరో మూడురోజుల్లో తెలంగాణా పర్యటనకు మోడీ వస్తున్న సమయంలో బండి అరెస్టు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అరెస్టు నేపధ్యంలో వెంటనే తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలని మోడీ ఆదేశించారట. మోడీతో భేటీ తర్వాత అమిత్, నడ్డా ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరు రాష్ట్రంలోని చాలామంది సీనియర్ నేతలతో ఫోన్లోలోనే మాట్లాడారు. తెలంగాణా ఇన్చార్జి తరుణ్ చుగ్ కూడా కేసీయార్ ప్రభుత్వంపై రెచ్చిపోయారు.
ఇక్కడ సమస్య ఏమైందంటే బండి అరెస్టు ఏదో రాజకీయ కారణాలతో అయితే ఇంత సెన్సేషనల్ కాకపోను. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టనేటప్పటికి సంచలనమైంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలంటేనే లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తుకు కీలకమైన మలుపని తెలిసిందే. ఒకవైపు టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై బండి రెచ్చిపోయి కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
ఇదే సమయంలో 10వ తరగతి మొదటి పరీక్ష తెలుగు ప్రశ్నపత్రం లీకేజీపై కేసీయార్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగ్గా ఇదే ఆరోపణలపై బండి అరెస్టవ్వటంతో ఏమి మాట్లాడాలో బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. ప్రశ్నపత్రం లీకేజీలో బండిని పోలీసులు ఏ1 నిందితుడిగా చూపించటాన్ని కమలనాథులు తట్టుకోలేకపోతున్నారు. అన్నీ ఆధారాలతోనే బండిని అరెస్టుచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో ప్రశ్నపత్రం లీకేజీలో తన పాత్రను బండి ఒప్పుకున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో ముందు ముందు ఈ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికీ అర్దంకావటంలేదు.